పార్టీ కోసం పనిచేసిన వారికే పట్టం : సీఎం చంద్రబాబు


తెలుగు దేశం పార్టీ కోసం పనిచేసిన వారిని ఎప్పుడూ విస్మరించే ప్రసక్తే లేదు.

కుప్పం: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.. అన్ని స్థానాల్లోనూ గెలవాల్సిందే అని పార్టీ శ్రేణులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కూటమే గెలువబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వరుసగా మూడో రోజు సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం కుప్పం నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేతలకు సమాజంలో మంచి పేరు, గుర్తింపు ఉంటుందని అన్నారు.

చెడ్డ పేరు తెచ్చుకునేలా ఏ ఒక్క నేత, కార్యకర్త వ్యవహరించకూడదని సూచించారు. పనితీరు ఆధారంగానే పదవులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. పదవుల నియామకాల్లో ఎలాంటి మొహమాటాలు ఉండవని కుండబద్దలు కొట్టారు. పార్టీ కోసం పనిచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించబోమని అన్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు కూడా నిఖార్సైన కార్యకర్తలను గౌరవించాలని సూచించారు. బూత్ స్థాయి మొదలుకుని ఏ పదవికైనా కార్యకర్తల ఆమోదం ఉండాల్సిందేనని తెగేసి చెప్పారు.

2029 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చి తీరుతామని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. గతం కంటే మెజార్టీ పెరిగేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కార్యకర్తల ఆర్థిక సాధికారత కోసం పార్టీ పరంగా కృషి చేస్తున్నామని వివరించారు. ఇంటికో పారిశ్రామికవేత్త విధానాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. దీన్ని ప్రజలతో పాటు.. పార్టీ కార్యకర్తలు కూడా అందిపుచ్చుకోవాల్సి ఉందన్నారు.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని సక్రమంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. అందరి ఆమోదంతో కుప్పంలో సమన్వయ కమిటీ వేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పై స్థాయిలోనే కాదు… క్షేత్ర స్థాయిలో కూడా పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలన్నారు.

సమస్యల పరిష్కారం విషయంలో పోలీసులు, అధికారులతో పార్టీ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలోని వాస్తవాలను ప్రభుత్వ, పోలీసు అధికారులకు వివరించి సమస్యలను పరిష్కరించేలా చూడాలని అన్నారు. పేదల పక్షాన నిలిచే టీడీపీ నేతలు, కార్యకర్తలకు అధికారులు, పోలీసులు కూడా సహకరించాలని సూచించారు. మంచికి అండగా నిలిచే టీడీపీ నేతలు, కార్యకర్తలను ప్రభుత్వ యంత్రాంగం గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజలతో అనుసంధానమై ప్రభుత్వ పథకాల అమలును కార్యకర్తలు, నేతలు పరిశీలించాలని సూచించారు.

పథకాల అమలులో ఏమైనా ఇబ్బందులు, జాప్యం జరిగితే వాటిని సరిచేసే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఛారిటీ చేద్దాం… పార్టీ ద్వారా రాజకీయమే చేద్దాం అని స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. కుప్పం నియోజకవర్గంలో ఎవరైనా రౌడీయిజం చేయాలనుకుంటే కుదరదని అన్నారు.

2019-24 మధ్య కాలం రాష్ట్రానికి ఓ పీడ కల అని అభివర్ణించారు. కుప్పం నియోజకవర్గంలో కూడా ప్రశాంతత చెడగొట్టాలని నాటి పాలకులు ప్రయత్నించారని వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ సమావేశానికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డి, కుప్పం నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కుప్పం పర్యటనలో భాగంగా రైతులు, పీ4 లబ్దిదారులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులతో సీఎం చంద్రబాబు వరుసగా సమావేశం అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *